విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోడికత్తి శ్రీను తల్లిని పరామర్శించిన నక్కా ఆనంద్ బాబు

  • ఐదేళ్లుగా జైలులో కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీను
  • శ్రీనుకు మద్దతుగా దీక్ష చేపట్టిన తల్లి, సోదరుడు
  • గతరాత్రి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • శ్రీను తల్లి, సోదరుడ్ని ఆసుపత్రికి తరలింపు 
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనును విడుదల చేయాలంటూ కొన్నిరోజులుగా అతడి కుటుంబ సభ్యులు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు నిన్న రాత్రి వారి దీక్షను భగ్నం చేశారు. కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి  కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. 

ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. "జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వ్యక్తులు మూడు నెలల్లోనే బయటకు వస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత బాబు బయటకు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. 

జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగిందన్న ఆరోపణలపై మా దళిత సోదరుడు జన్నుపల్లి శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. బహుశా భారతదేశంలో ఏ పీనల్ కోడ్ ప్రకారం జైల్లో ఉంచారో అర్థం కాని విషయం. అది 307 సెక్షన్ కేసు కూడా కాదు చిన్న దాడి మాత్రమే! 

ఆరోజు శ్రీనివాసరావు చెప్పాడు... నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని, ఇలా ఏదైనా చిన్న దాడి జరిగితే అది సింపతీగా మారి ఎక్కువ సీట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో నేనే చేశాను అని, అదే సింపతీతో జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాడు. కోర్టుకు వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థ NIA తో విచారణ చేయించాడు. NIA విచారణ చేసి ఛార్జిషీట్ ఫైల్ చేసిన ఈ కేసులో ఇంకా బెయిల్ రాకపోవటం విచిత్రంగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా అడ్డుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 

జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ని అడ్డంగా గొడ్డలి పెట్టి నరికిన ముద్దాయిలు అందరూ బయట తిరుగుతున్నారు. దీనిలో భాగం ఉంది అని ఆరోపణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. తన మీద దాడి చేసిన శ్రీనివాసరావు మాత్రం జైలులోనే ఉండిపోయాడు. నువ్వు కోర్టుకి వెళ్లి సాక్ష్యం చెప్పు అంటే సాక్ష్యం చెప్పడు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? నీ మీద దాడి జరిగిందా లేకపోతే హత్యాయత్నం జరిగిందా? ఏది జరిగితే అది చెప్పు... నువ్వు ఎందుకు చెప్పవు? 

మా దళిత సోదరుడు జైల్లో మగ్గిపోతున్నాడు. అతనితో పాటు అతని కుటుంబం, స్నేహితులు ఎన్నో బాధలు పడుతున్నారు. నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పవు? అతనే చేశాడని చెప్పినా కూడా ఐదు సంవత్సరాలు శిక్ష పడదు. 

గత రెండు రోజులుగా శ్రీనివాసరావు జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అందుకు మద్దతుగా శ్రీనివాసరావు తల్లి, అన్న నిరాహార దీక్ష చేస్తుంటే ఈరోజు తెల్లవారుజామున దీక్ష భగ్నం చేసి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు... ఆ విగ్రహానికి మా బాధలు చెప్పుకుంటామని వెళుతుంటే, వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. 

ఏ కేసులో అయినా సాక్షి అనేవాడు  ఒకటికి పది సార్లు తప్పించుకుంటూ ఉంటే కోర్టులు NBW ఇష్యూ చేయాలి. తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలి. ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. తన మీద దాడి చేశాడు అనే కారణంతో ఒక అమాయక వ్యక్తిని జైల్లో పెట్టించి సాక్ష్యం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 

ఇంకా ఎంతకాలం తప్పించుకు తిరుగుతావ్ జగన్మోహన్ రెడ్డి? ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి తప్పించుకోగలవా? రాబోయే 80 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడైతే తప్పించుకోగలవేమో గాని అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు అని హెచ్చరిస్తున్నాము" అంటూ నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.


More Telugu News