ఈడీ సమన్లు అందుకున్నాక విచారణకు హాజరు కావాల్సిందే. లేదంటే జరిగేదిదే..!

  • వ్యక్తిగతంగా రమ్మని పిలిస్తే వెళ్లడం మినహా గత్యంతరం లేదు..
  • పదే పదే నోటీసులు పంపినా వెళ్లకుంటే అరెస్ట్ చేయొచ్చు
  • దేశంలో ఎవరికైనా నోటీసులు పంపే అధికారం ఈడీకి ఉందంటున్న నిపుణులు
ఆర్థిక నేరాలపై విచారణ జరిపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి సమన్లు అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. పలుమార్లు నోటీసులు పంపినా హాజరు కాకపోతే విచారణకు సహకరించడంలేదని భావించి సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసే అధికారం కూడా ఈడీ ఆఫీసర్లకు ఉంటుందని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా దేశంలోని ఏ వ్యక్తికైనా సరే నోటీసులు పంపించి, విచారణకు పిలిచే పవర్ ఈడీకి ఉందని మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50(2) చెబుతోంది.

ఏదేనీ ఆర్థిక నేరంలో ప్రమేయం ఉందనే అనుమానంతో కానీ, సాక్ష్యాధారాలు ఉన్నాయని కానీ ఈడీ అధికారులు భావించినపుడు విచారణకు పిలుస్తూ సమన్లు పంపించవచ్చు. కేసుకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సరెండర్ చేయాలని కోరవచ్చు. ఇలా నోటీసులు అందుకున్న వ్యక్తికి అందులోని సూచనలు ఫాలో కావడం మినహా మరో మార్గం లేదని మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50 (3) చెబుతోంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లలో పేర్కొన్న సందర్భాలలో లాయర్లను కానీ, ఇతర ప్రతినిధులను కానీ పంపించే అవకాశం ఉండదు. తప్పనిసరిగా స్వయంగా హాజరు కావాల్సిందే.

పదే పదే సమన్లు పంపినా ఈడీ విచారణకు హాజరుకాకుంటే.. విచారణకు సహకరించడంలేదని అధికారులు నిర్ధారించి, సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. అదేవిధంగా ఆర్థిక నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యులను ప్రభావితం చేయడం కానీ, సాక్ష్యాధారలను మాయం చేసే అవకాశం ఉందని కానీ అనుమానించినా.. ఆ వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ఈడీ ఆఫీసర్లకు ఉంటుంది. అయితే, అధికారులు తమ అనుమానాలకు తగిన ఆధారాలను చూపగలగాలి. ఈడీ సమన్లకు బదులివ్వకపోవడం, విచారణకు హాజరుకాకపోవడం అనేది అరెస్టుకు ఒక కారణంగా మారుతుంది.

అయితే, దానిని కారణంగా చూపుతూ అరెస్టు చేయడం కుదరదు. ఏదైనా కేసుకు సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఓ వ్యక్తిని అరెస్టు చేసే అధికారమూ ఈడీ ఆఫీసర్లకు ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అరెస్టుకు తగిన కారణాన్ని అధికారులు కోర్టులకు వెల్లడించాల్సి ఉంటుంది. 2022 లో మహారాష్ట్ర మంత్రి అరెస్టే దీనికి ఉదాహరణ. ఈడీ ఆయనకు ఎలాంటి నోటీసులు పంపించలేదు.. సడెన్ గా ఇంటికి వెళ్లిన అధికారులు మంత్రిని అరెస్టు చేసి, విచారణకు తీసుకెళ్లారు.

విచారణకు సహకరించడంలేదనే అరోపణలతో అరెస్టు చేసిన సందర్భాలలో ఈడీ డైరెక్టర్ రాత పూర్వకంగా కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. ఇక, విచారణ సందర్భంగా అనుమానితులు వెల్లడించే వివరాలకు చట్టబద్దత ఉంటుంది. ఈడీ అధికారుల ముందు చెప్పే ఏ విషయమైనా సరే న్యాయస్థానాల ముందు చెప్పినట్లేనని మనీలాండరింగ్ చట్టం చెబుతోంది. ఈడీ విచారణ తర్వాత ఇచ్చే స్టేట్ మెంట్ (రాతపూర్వక) కు కోర్టులో ప్రమాణం చేసి వెల్లడించినంత విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


More Telugu News