మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మాణం.. కేంద్రం కీలక నిర్ణయం

  • స్వేచ్ఛాయుత రాకపోకలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నిర్ణయం
  • త్వరలోనే అందుబాటులోకి రానున్న వీసా
  • మయన్మార్ నుంచి వలసలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన
మయన్మార్ నుంచి భారత్‌లోకి పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  
భారత్‌లోకి స్వేచ్ఛాయుత రాకపోకలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మయన్మార్‌ సరిహద్దు వెంబడి కంచె నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం కీలక ప్రకటన చేశారు. అసోం పోలీసు కమాండోల పాసింగ్‌ పరేడ్‌ కార్యక్రమంలో అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ సరిహద్దు మాదిరిగానే మయన్మార్ బార్డర్‌ను కూడా పరిరక్షించాల్సి ఉందని ఆయన అన్నారు. 

సరిహద్దు వెంబడి కంచెను నిర్మించడం ద్వారా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ‘ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్’ను రద్దు చేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు ఇకపై వీసాలు తీసుకొని ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలోనే వీసాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భారత్-మయన్మార్ సరిహద్దులో నివసించే ప్రజల మధ్య బంధుత్వాలు, జాతి సంబంధాలు ఉండడంతో 1970లో ‘ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్’ను తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం సరిహద్దు ప్రజలు స్వేచ్ఛాయుతంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలు సాగిస్తున్నారు.

కాగా మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించారు. మిజోరంలోని లాంగ్ట్లై జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ మయన్మార్ రాష్ట్రమైన రఖైన్‌లో ఒక జాతికి చెందిన సాయుధ సమూహం ‘అరకాన్ ఆర్మీ’ మిలిటెంట్లు తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో మయన్మార్ ఆర్మీ సైనికులు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. వీరందరిని వెనక్కి పంపించాలని కేంద్రాన్ని మిజోరం ప్రభుత్వం కోరింది. ఇదిలావుంచితే మయన్మార్‌లో తిరుగుబాటు దళాలు, కమిటీ పరిపాలన మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది మయన్మార్ ఆర్మీ సిబ్బంది పారిపోయి భారత్‌కు వస్తున్నారు.


More Telugu News