ఢిల్లీ 'బాబర్ రోడ్డు' సైన్ బోర్డుపై 'అయోధ్య మార్గ్' స్టిక్కర్... తొలగించిన పోలీసులు

  • సైన్ బోర్డుపై స్టిక్కర్ వేసిన హిందూ సేన కార్యకర్తలు
  • పేరు మార్చాలని తాము ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నామన్న అధ్యక్షుడు విష్ణుగుప్తా
  • అయోధ్యలో బాబర్ మసీదు లేదని.. ఇక ఢిల్లీలో బాబర్ మార్గ్ ఎందుకు? అని ప్రశ్న
దేశ రాజధాని ఢిల్లీలోని 'బాబర్ రోడ్డు' సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు 'అయోధ్య మార్గ్' స్టిక్కర్‌ను వేశారు. ఈ సందర్భంగా హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా మీడియాతో మాట్లాడుతూ... ఇక్కడి బాబర్ రోడ్డు పేరును మార్చాలని తమ సంస్థ చాలాకాలంగా డిమాండ్ చేస్తోందన్నారు. బాబర్ రోడ్డు పేరును తొలగించి దానికి మన దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని కోరుతున్నామన్నారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖకు, ఎన్డీఎంసీకి పలుమార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో బాబర్ మసీదు లేకుండా పోయిందని... అలాంటప్పుడు ఢిల్లీలో బాబర్ రోడ్డు ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ రోడ్డును చూస్తుంటే ఇప్పటికీ బాబర్ కాలంలో జీవిస్తున్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే ఈ రోడ్డు పేరును అయోధ్య మార్గ్‌గా మార్చినట్లు తెలిపారు. మరోవైపు, అయోధ్య మార్గ్‌గా పేర్కొంటూ సైన్ బోర్డుపై వేసిన స్టిక్కర్‌ను పోలీసులు తొలగించారు.


More Telugu News