ఇతర దేశాలకు వెళ్లినప్పుడు రాజకీయాలు మాట్లాడవద్దు: దానం నాగేందర్

  • బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున తొక్కి పెడతామని రేవంత్ రెడ్డి అనడం సరికాదన్న దానం
  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
  • విదేశాల్లో రాష్ట్రం కోసం పెట్టుబడులను ఆకర్షించేలా ప్రయత్నం చేయాలి కానీ పరువును బజారుకీడ్చవద్దని సూచన
  • అధికారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున తొక్కిపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తప్పుబట్టారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. అధికారంలో ఉన్నా... లేకపోయినా తాము ఒకేలా ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో రాష్ట్రం కోసం పెట్టుబడులను ఆకర్షించేలా ప్రయత్నం చేయాలి తప్ప... రాష్ట్ర పరువును బజారుకు ఈడ్చవద్దని సూచించారు.

బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతున పాతిపెడదామని హెచ్చరించడం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నప్పుడు విమర్శ... ప్రతివిమర్శలు సహజమేనని.. కానీ విదేశాల్లో రాజకీయాలు సరికాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని సవాల్ చేశారు. దాదాపు అన్ని లోక్ సభ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందనే ధీమా తమకు ఉందన్నారు. రాజకీయాల్లో ఎవరి అజెండాలు వారికి ఉంటాయన్నారు.

 దానిని అహంకారమని భావించకూడదు..

బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు దానం స్పందిస్తూ... అధికారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరుగుతాయని... దానిని అహంకారమని భావించడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ఒకేలా ఉండాలన్నారు.


More Telugu News