శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ

  • తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగంలో పర్యటన
  • తమిళ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయ సందర్శన
  • జై శ్రీరాం నినాదాలతో ప్రధానిని ఆహ్వానించిన తమిళులు
భూలోక వైకుంఠంగా పేరొందిన శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణ ధోతి, అంగవస్త్రంతో ఆలయానికి వచ్చిన మోదీ.. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తులను ప్రధాని దర్శించుకున్నారు. ప్రాంగణంలోని ఆలయ ఏనుగుకు మేత అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. 

కావేరి, కొల్లిదామ్ నదుల మధ్య దీవిలో వెలిసిన వైష్ణవ మందిరమే శ్రీరంగనాథస్వామి ఆలయం.. ఇక్కడ మహావిష్ణువు శ్రీరంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తమిళులు రంగనాథర్ గా స్వామిని భక్తితో కొలుచుకుంటారు. ఆలయ నిర్మాణంలో చోళులు, పాండ్యులు, హొయసళ రాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు పాలుపంచుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

కాగా, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని శనివారం శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఉదయం చెన్నై వచ్చిన ప్రధానికి తమిళులు ఘనంగా స్వాగతం పలికారు. చెన్నైలో ప్రధాని రోడ్ షో గా ముందుకు సాగగా.. రోడ్డుకు ఇరుపక్కలా బారులు తీరిన జనం ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. వారందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు.




More Telugu News