బాల రాముడి విగ్రహం ఫొటో వైరల్.. తప్పుపట్టిన ఆచార్య సత్యేంద్ర దాస్

  • ప్రాణప్రతిష్ఠకు ముందు విగ్రహం కళ్లను కప్పి ఉంచాలన్న ప్రధాన పూజారి
  • ప్రచారంలో ఉన్న ఫొటో అసలు విగ్రహానిది కాకపోవచ్చని వ్యాఖ్య
  • ఒకవేళ అదే నిజమైతే విచారణ జరిపించాల్సిందేనని వెల్లడి
అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే విగ్రహం ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోపై శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫొటో అసలు విగ్రహానిది కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. ప్రాణప్రతిష్ఠకు ముందు విగ్రహం కళ్లను చూపించకూడదని, తప్పనిసరిగా కళ్లను కవర్ చేసేలా క్లాత్ తో కప్పి ఉంచాలనేది శాస్త్ర నియమమని ఆయన చెప్పారు.

ఒకవేళ అదే నిజమైన విగ్రహం కనుక అయి ఉంటే సదరు ఫొటోను బయటకు వెల్లడించిన వారు ఎవరనేదానిపై విచారణ జరిపించాల్సి ఉంటుందని సత్యేంద్ర దాస్ చెప్పారు. ఈమేరకు శనివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలు అన్నీ శాస్త్రీయంగా జరిపిస్తామని ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణప్రతిష్ఠకు ముందు విగ్రహం కళ్లను చూపించకూడదని ఆయన స్పష్టం చేశారు.

అదేవిధంగా గడిచిన 70 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని కూడా రామమందిరంలో ప్రతిష్ఠిస్తామని చెప్పారు. అదే గర్భగుడిలో కొత్త విగ్రహం పక్కనే పాత విగ్రహానికి స్థానం కల్పిస్తామని వివరించారు. అయితే, కొత్త ఆలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నపుడే ప్రాణప్రతిష్ఠ తంతు నిర్వహించడం సంప్రదాయమని, ఇప్పటికే పూజలు అందుకుంటున్న విగ్రహానికి మరోమారు ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉండదని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ప్రస్తుతం టెంట్ లో ఉన్న పాత విగ్రహాన్ని మందిరంలోకి తీసుకొచ్చే బాధ్యతను బహుశా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వీకరిస్తారని అభిప్రాయపడ్డారు.


More Telugu News