బాత్రూమ్‌లు శుభ్రం చేసేందుకు ఇలాంటిదే కావాలి: ఆనంద్ మహీంద్రా

  • ‘సోమాటిక్’ సంస్థ రూపొందించిన రోబో వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • రోబో పనితీరుతో అబ్బుర పడ్డ వైనం
  • ఇలాంటివి భారత్‌లోనూ తక్షణం అందుబాటులోకి రావాలని వ్యాఖ్య
ప్రపంచంలోని ఆసక్తికర విషయాల్ని తమ ఫాలోవర్లతో పంచుకోవడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ రోబో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనుషుల సాయం లేకుండా తనంతట తానుగా  బాత్రూమ్‌లు శుభ్రం చేసే ఈ రోబో పనితీరు చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. ఇలాంటివి తక్షణం అందుబాటులోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

సోమాటిక్ అనే సంస్థ ఈ రోబోను సిద్ధం చేసినట్టు ఆనంద్ మహీంద్రా తెలిపారు. ‘‘సోమాటిక్ సంస్థ రూపొందించిన ఈ రోబో అద్భుతం. తనంతట తానుగా బాత్రూమ్‌లను శుభ్రం చేస్తోంది. వాహనతయారీ దారులుగా మాకు ఫ్యాక్టరీల్లో రోబోలు వాడటం అలవాటే. కానీ ఇలాంటి రోబోలు మరింత ముఖ్యమైనవని చెప్పకతప్పదు. ఇలాంటివి మనకూ తక్షణం అందుబాటులోకి రావాలి’’ అని ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. 

ఆనంద్ మహీంద్రా పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడంతో ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 4.4 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే, నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. రోబో పనితీరు చూసి కొందరు అబ్బురపడితే మరికొందరు మాత్రం ఇలాంటి వాటితో ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News