డైలమా వద్దు! టీ20 ప్రపంచకప్ జట్టులో వారిద్దరినీ ఆడించండి.. టీమిండియా స్టార్ క్రికెటర్ సలహా

  • పాండ్యాను పక్కనపెట్టి దూబేను తీసుకోవాలని అభిమానుల డిమాండ్
  • జట్టులో ఇద్దరూ ఉండాలని చెప్పిన ఆకాశ్ చోప్రా
  • దూబేలో తనకు యువరాజ్ సింగ్ కనిపిస్తున్నాడన్న మాజీ స్టార్
  • బ్యాటింగ్ ఆర్డర్‌లో కొంచెం డౌన్‌లో పంపిస్తే కుమ్మేస్తాడన్న చోప్రా
ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుపై టీమిండియా సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్న వేళ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచన చేశాడు. ఆల్‌రౌండర్లు శివందూబే, హార్దిక్ పాండ్యా ఇద్దరినీ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. దూబేలో తనకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కనిపిస్తున్నాడని, బౌలర్లను అతడు ఎదుర్కొనే తీరు యువీలానే ఉందని పేర్కొన్నాడు. 30 ఏళ్ల దూబే.. లోయర్ ఆర్డర్‌లో చక్కగా పనికొస్తాడని చెప్పాడు. 

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబేను ముందుగా క్రీజులోకి పంపి తప్పు చేశారని, అతడిని పంపడానికి ముందు సంజు శాంసన్‌ను కానీ, రింకు సింగ్‌ను కానీ క్రీజులోకి పంపితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే అతడు ఇన్నింగ్స్‌ను నిర్మించలేకున్నా ఎదురుదాడికి దిగుతాడని చెప్పుకొచ్చాడు. అతడిలో తనకు యువరాజ్‌సింగ్ కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. కాబట్టి అతడిని డౌన్‌లో పంపడమే మేలని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానల్‌లో వివరించాడు. 

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో దూబే సిక్సర్లు బాదిన విధానం, అతడి బ్యాటింగ్ పవర్ చూసి టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ను పక్కన పెట్టి దూబేను తీసుకోవాలని చాలామంది చెబుతున్నారని, కానీ జట్టులో వారిద్దరూ ఉండాలని చోప్రా పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌లో మూడు మ్యాచుల్లో దూబే 124 పరుగులు చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.


More Telugu News