రోహిత్‌, కోహ్లీలను టీ20లకు ఎంపిక చేయడంపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రోహిత్, కోహ్లీలను ఎంపిక చేయడం అంత తెలివైన నిర్ణయం కాదన్న సునీల్ గవాస్కర్
  • ఆఫ్ఘనిస్థాన్‌తో రెండవ మ్యాచ్‌లో తొలి బంతికే ఔట్ అయిన తీరు వింతగా ఉందని విమర్శించిన క్రికెట్ దిగ్గజం
  •  రోహిత్ ఔటయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడా అనిపించిందని వ్యాఖ్య
మరో 5 నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు ఎంపిక చేయడంపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి పునరాగమనంతో అంత ప్రయోజనంలేదన్నారు. 

‘‘ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కి రోహిత్ శర్మ, కోహ్లీలను తిరిగి ఎంపిక చేయడం అంత తెలివైన నిర్ణయం కాదు. రెండవ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయిన విధానం వింతగా ఉంది. క్రీజులో ఔట్ అవ్వడానికి ఆసక్తిగా ఉన్నాడనిపించింది’’ అన్నారు. ఈ మేరకు గవాస్కర్ స్పోర్ట్‌స్టార్‌ కాలమ్‌లో రాసుకొచ్చారు. 

మొదటి మ్యాచ్‌లో డకౌట్ అవ్వడంతో రెండవ మ్యాచ్‌లో కొన్ని పరుగులైనా సాధిస్తాడని ఊహించినప్పటికీ రెండవ మ్యాచ్‌లోనూ రోహిత్ సున్నా పరుగులకే ఔట్ అయ్యాడని గవాస్కర్ ప్రస్తావించారు. రెండవ మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికి రోహిత్ మరచిపోలేని షాట్ ఆడి ఔట్ అయ్యాడని పేర్కొన్నారు. ఇక మూడవ టీ20 మ్యాచ్‌లో కోహ్లీ ట్రాక్‌లోకి వస్తున్నట్టు కనిపించినప్పటికీ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే రోహిత్ అదరగొట్టాడు. 69 బంతులు ఎదుర్కొని 121 పరుగులు కొట్టాడు. రోహిత్ బ్యాటింగ్ సాయంతో భారత్ తన ప్రత్యర్థి ఆఫ్గనిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరిని ఎంపిక చేయడంతో ఆప్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ సిరీస్‌లో వేర్వేరు మ్యాచ్‌ల్లో రోహిత్, కోహ్లీ డకౌట్‌ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ తొలి రెండు మ్యాచ్‌ల్లో సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌తో తన హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోనూ రాణించలేకపోయాడు. దీంతో మరో ఐదు నెలల్లో టీ20 ప్రపంచ కప్ ఆడనున్న నేపథ్యంలో రోహిత్, కోహ్లీలను జట్టులోకి తీసుకోవడం సరైనదేనా అని చాలా మంది వాదిస్తున్నారు.


More Telugu News