ఒకేసారి నలుగురు మహిళా క్రికెటర్ల రిటైర్మెంట్

  • వెస్టిండీస్ మహిళా క్రికెట్లో ఆసక్తికర పరిణామం
  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన కైసియా, కైషోనా, అనీసా, షకీరా 
  • వీరిలో కైసియా, కైషోనా కవలలు
వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్టులో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. ఒకేసారి నలుగురు మహిళా క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. కైసియా నైట్, కైషోనా నైట్, షకీరా సల్మాన్, అనీసా మహ్మద్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. వీరిలో కైసియా, కైషోనా కవలలు. 

వెస్టిండీస్ మహిళా జట్టు 2016లో టీ20 వరల్డ్ కప్ నెగ్గగా, అందులో ఈ నలుగురూ సభ్యులుగా ఉన్నారు. 

అనీసా మహ్మద్ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి విండీస్ జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. అనీసా ప్రధానంగా ఆఫ్ స్పిన్నర్. ఆమె 141 వన్డేల్లో 180 వికెట్లు... 117 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో 125 వికెట్లు తీసింది. 20 ఏళ్ల తన అంతర్జాతీయ కెరీర్ కు ఆమె తాజాగా ముగింపు పలికింది. 

ఇక, మీడియం పేసర్ షకీరా సల్మాన్ కూడా విండీస్ తరఫున ఫర్వాలేదనిపించే గణాంకాలు నమోదు చేసింది. 100 వన్డేల్లో 82 వికెట్లు తీసిన షకీరా... 96 అంతర్జాతీయ టీ20 పోటీల్లో 51 వికెట్లు సాధించింది. అనీసా, షకీరా వెస్టిండీస్ జట్టు వైస్ కెప్టెన్లుగానూ సేవలందించారు. 

ఇక కైసియా, కెషోనా కూడా విండీస్ కు దశాబ్ద కాలానికి పైగా సేవలు అందించారు. కైసియా వికెట్ కీపర్/ఎడమచేతివాటం బ్యాటర్ గా రాణించింది. కైషోనా బ్యాటర్ గా ఆకట్టుకుంది.


More Telugu News