జల్లికట్టు ఎద్దుకు బతికున్న కోడిని తినిపించిన యూట్యూబర్ పై కేసు

  • తమిళనాడులో ఘటన
  • వ్యూస్ కోసం యూట్యూబర్ నిర్వాకం
  • ఎద్దుతో బలవంతంగా కోడిని తినిపించిన వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తమిళనాడులో జల్లికట్టు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఓ యూట్యూబర్ జల్లికట్టు ఎద్దుకు బతికున్న కోడిని తినిపించి చిక్కుల్లో పడ్డాడు. సేలం జిల్లా చిన్నప్పపట్టిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపిస్తున్న వీడియో ఓ యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు. 

ఈ వీడియోను గత డిసెంబరులో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపుల్స్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా సంస్థ ప్రెసిడెంట్ అరుణ్ ప్రసన్న ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఎద్దు శాకాహారి అని, ఎద్దుతో బతికున్న కోడిని తినిపించడం ఎంతో క్రూరమైన విషయం అని ప్రసన్న పేర్కొన్నారు. గడ్డి తినే ఎద్దు కోడి ఈకలు, ఎముకలను ఎలా నమలగలదు? అది ఎంత బాధాకరమైన విషయం? అని అరుణ్ ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. 

అరుణ్ ప్రసన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యూట్యూబర్ పైనా, వీడియోలో కనిపిస్తున్న ఇతర వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.


More Telugu News