నా అభ్యర్థనలన్నీ చెత్తబుట్టలో పడేస్తున్నారు: ఆనం రామనారాయణరెడ్డి
- రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా సంస్కృతి పెరిగిపోయిందన్న ఆనం
- నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం అడిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన
- స్థానిక సంస్థలకు నిధులు అడిగితే తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపాటు
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాఫియా గ్యాంగ్ లు పెరిగిపోయాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్కృతి పెరిగిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో పోలీసుల సభలోనే తాను చెప్పానని తెలిపారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి తనపై కక్ష కట్టారని చెప్పారు.
వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏం కోరినా పట్టించుకోవడం లేదని ఆనం అన్నారు. తన అభ్యర్థనలన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల-స్వర్ణముఖి లింక్ కాలువకు నిధులు, వెంకటగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కావాలని అడిగినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు నిధులు కావాలని అడిగితే తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికింది ఉమ్మడి నెల్లూరు జిల్లానే అని ఆనం చెప్పారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలం అధికార వైసీపీని వీడి టీడీపీ అధినేత చంద్రబాబు వెంట నడిచేందుకు వచ్చామని తెలిపారు. వెంకటగిరిలో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో మాట్లాడుతూ ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు.