ఉచితాలకు నిర్వచనం ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
- ఉచితాలను నిర్వచించమంటూ చాలా మంది తనను అడిగారన్న లక్ష్మీనారాయణ
- శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్నవారికి నగదు ప్రయోజనాన్ని అందించడమే ఉచితాలన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు
- ఎక్స్ వేదికగా స్పందించిన లక్ష్మీ నారాయణ
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలు సరికాదని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని మేధావి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉచితాలు అందించి జనాలను సోమరిపోతులుగా మార్చుతున్నారనే ఒక తీవ్రమైన విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఉచితాలకు తనదైన నిర్వచనం ఇచ్చారు. శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్న వ్యక్తికి ఏ పనీ చేయకుండానే నగదు రూపంలో ప్రయోజనం అందించడాన్ని ఉచితాలు అంటారని అన్నారు. ఉచితాలను నిర్వచించమంటూ చాలా మంది తనను అడిగారని, ఫ్రీబీ అంటే ఇదేనని ఆయన అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.