అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో అరుదైన రికార్డు

  • విజయం కోసం రెండు సూపర్ ఓవర్లు  ఆడిన భారత్-ఆఫ్ఘనిస్థాన్
  • రెండో సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపు
  • ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు ఇదే తొలిసారి
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌లో బెంగళూరులో జరిగిన చివరిదైన మూడో టీ20లో అరుదైన రికార్డు ఒకటి వచ్చి చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ శతకబాదుడుతో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం 213 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రత్యర్థి ఆప్ఘనిస్థాన్ అంతే దూకుడుగా ఆడి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 

మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్థాన్  16 పరుగులు చేసింది. అనంతరం 17 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కూడా 16 పరుగులే చేయడంతో మ్యాచ్ మరోమారు టై అయింది. దీంతో మళ్లీ రెండో సూపర్ ఓవర్ మొదలైంది. 

ఈసారి భారత జట్టు 11 పరుగులు చేయగా, ఆఫ్ఘనిస్థాన్ జట్టు మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. కాగా, ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు వేయాల్సి రావడం ఇదే తొలిసారి.


More Telugu News