ఇరాన్‌పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు.. ఏడు ప్రాంతాల్లో క్షిపణి దాడులు

  • బలూచ్ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై క్షిపణి దాడులు చేసిన పాక్
  • రహస్య స్థావరాలు, శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంటున్న మీడియా రిపోర్టులు
  • ఇరాన్ దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించిన రెండో రోజే పాకిస్థాన్ దాడులు
దాయాది దేశం పాకిస్థాన్ సంచలన చర్యకు ఉపక్రమించింది. తమ గగనతలంలోకి చొరబడి ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్‌లోని బలూచ్ వేర్పాటువాద గ్రూపులైన ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్‘, ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’లకు చెందిన పోస్టులపై క్షిపణులతో విరుచుకుపడింది. పలు స్థావరాలను ధ్వంసం చేసినట్టు అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇరాన్‌లోని ఏడు ప్రాంతాల్లో పాక్  క్షిపణి దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల రహస్య స్థావరాలు, శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ప్రతీకార దాడులపై పాకిస్థాన్, ఇరాన్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

కాగా ఇరాన్ తమ గగనతలాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మంగళవారం తీవ్రంగా హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్ దాడులకు పాల్పడిందని, ప్రతీకార చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దాడుల కారణంగా ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారని పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ఇదిలావుంచితే పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సున్నీ మిలిటెంట్ గ్రూప్ ‘జైష్ అల్ అద్ల్’ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇరాన్ రెండు రోజుల క్రితం వైమానిక దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఉగ్రసంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. కాగా 2012లో ఏర్పడిన ‘జైష్ అల్ అద్ల్’ను ఇరాన్ ఉగ్రసంస్థగా గుర్తించింది. ఇరాన్ బలగాలపై పలుమార్లు దాడులకు పాల్పడిన చరిత్ర ఉండడంతో దీనిని ఉగ్రసంస్థగా ప్రకటించింది.


More Telugu News