పాకిస్థాన్ రికార్డును బ్రేక్ చేసేందుకు అడుగుదూరంలో నిలిచిన టీమిండియా!

  • ఆఫ్ఘనిస్థాన్‌పై నేటి మ్యాచ్‌లో గెలిస్తే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక క్లీన్‌స్వీప్‌లు సాధించిన జట్టుగా నిలవనున్న భారత్
  • ప్రస్తుతానికి చెరో 8 వైట్‌వాష్‌లతో సమంగా నిలిచిన ఇండియా, పాకిస్థాన్
  • ఇప్పటికే 2-0 తేడాతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌ను దక్కించుకున్న భారత్
స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఈ రోజు (బుధవారం) బెంగళూరు వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌లో గెలిస్తే 3-0 తేడాతో సిరీస్‌ను వైట్‌వాష్ చేయనుంది. అదే జరిగితే టీ20 క్రికెట్‌లో భారత్ నయా చరిత్ర సృష్టించనుంది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక క్లీన్ స్వీప్‌లు సాధించిన జట్టుగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం చెరో 8 ద్వైపాక్షిక సిరీస్‌ల క్లీన్ స్వీప్‌తో భారత్, పాకిస్థాన్ సమంగా నిలిచాయి. బెంగళూరు మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సాధించిన క్లీన్ స్వీప్‌ల సంఖ్య 9కి చేరుకుంటుంది.

కాగా నేడు (బుధవారం) ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ టీ20 వరల్డ్ కప్‌2024కు ముందు టీమిండియాకు చిట్టచివరి టీ20 మ్యాచ్‌ కానుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్ తర్వాత నేరుగా ప్రపంచ కప్ ఆడాల్సి ఉంటుంది.


More Telugu News