హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి.. 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

  • ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుందన్న సీఎం
  • ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ఆర్ఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి
  • ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని స్పష్టీకరణ 
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎన్‌హెచ్ఏఐని సీఎం రేవంత్ కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. అడ్డంకులన్నీ అధిగమించి.. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడిందన్నారు.

భారత్ మాల పరియోజన ఫేజ్ ‌‌వన్‌లో  రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) 158.645 కిలోమీటర్ల మేరకు తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది.  

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవశ్యాన్ని సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో  సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 

నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలలలో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని NHAIని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యానైనా నిర్వహించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని అన్నారు. 


More Telugu News