విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్

విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
  • విజయవాడ స్వరాజ్య మైదానంలో భారీ అంబేద్కర్ విగ్రహం
  • రూ.400 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనం 
  • ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్న విజయసాయిరెడ్డి
  • అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంస 
ఏపీ ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కాగా, అంబేద్కర్ స్మృతి వనం కూడా రూపుదిద్దుకుంది. ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19న సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా సమతా సభ ఏర్పాటు చేశామని, 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. లేజర్ షో గానీ, డ్రోన్ షో గానీ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఈ నెల 20 నుంచి విజయవాడలో అంబేద్కర్ విగ్రహ సందర్శనకు అనుమతి ఉంటుందని అన్నారు. 

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని రూ.400 కోట్లతో నిర్మించారని తెలిపారు. ఈ భారీ అంబేద్కర్ విగ్రహం సమసమాజానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తుందని విజయసాయి పేర్కొన్నారు. 

అంబేద్కర్ మహనీయుడి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళుతున్నారని విజయసాయి కొనియాడారు. నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్ స్ఫూర్తి ఉందని అన్నారు.


More Telugu News