ప్రయాణ గమనంలో మరో విప్లవం.. ధ్వనివేగానికి మించి ప్రయాణించే విమానాన్ని ఆవిష్కరించిన నాసా.. వీడియో ఇదిగో!

  • శబ్దవేగానికి 1.4 రెట్లు అధికంగా ప్రయాణించే ఎక్స్-59
  • ప్రపంచంలోనే తొలి నిశ్శబ్ద సూపర్‌సోనిక్ విమానంగా ఎక్స్-59
  • మొత్తం విమానం పొడవులో మూడింట ఒక వంతు సన్నని ముక్కు
  • షాక్ తరంగాలను తిప్పికొట్టేందుకే
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. వాణిజ్య పరంగా సూపర్‌సోనిక్ ప్రయాణాన్ని ఆరంభించే లక్ష్యంతో శుక్రవారం నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్‌సోనిక్ విమానాన్ని ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌లో లాక్‌హాడ్ మార్టిన్ స్కంక్‌ వర్క్స్‌తో కలిసి నాసా ఈ ప్రయోగాత్మక విమానాన్ని (ఎక్స్-59) ఆవిష్కరించింది. 

ఈ విమాన గరిష్ఠ వేగం ధ్వనికంటే 1.4 రెట్లు అధికం. అంటే గంటకు 1,488 కిలోమీటర్లు. ఈ ఏడాది చివర్లో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నిశ్శబ్ద సూపర్ సోనిక్ విమానం. సన్నగా ఉండే ఎక్స్-59 ముక్కు దాని మొత్తం పొడవులో మూడింట ఒక వంతు ఉంది. దీనివల్ల సోనిక్ బూమ్స్‌కు కారణమయ్యే షాక్ తరంగాలను తిప్పికొట్టేందుకు ఉపయోగపడుతుంది.

విమానం మొత్తం పొడవు 99.7 అడుగులు కాగా, వెడల్పు 29.5 అడుగులు. విమానం సూపర్ సోనిక్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సాధారణ విమానాల్లో ఉండే ఫార్వర్డ్-ఫేసింగ్ కిటికీలను తొలగించారు. అతి తక్కువ కాలంలోనే దీనిని అభివృద్ధి చేసి టేకాఫ్ ‌కు సిద్ధం చేసినట్టు నాసా తెలిపింది. ఎక్స్-59తో ప్రయాణ గమనమే మారిపోతుందని పేర్కొంది.


More Telugu News