కవితకు ఈడీ నోటీసుల జారీ... కవిత స్పందనపై సర్వత్రా ఆసక్తి

  • రేపు ఉదయం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు
  • గత ఏడాది ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కవిత
  • ఈడీ నోటీసులపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ నెల 5నే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తాజాగా వెల్లడైంది. ఈ కేసులో గత ఏడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. ఈ క్రమంలో మరోసారి నోటీసులు పంపించింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు పంపించింది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపించారు. అయితే తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. 

తాజాగా కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ తాజా నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News