ప్రియురాలి కోసం ఆడ వేషం వేసి అడ్డంగా దొరికిపోయాడు!

  • జనవరి 7న పంజాబ్ లో ఆరోగ్య కార్యకర్త ఉద్యోగ నియామక పరీక్ష 
  • ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న పరంజీత్ కౌర్ అనే యువతి
  • ప్రియురాలికి ఉద్యోగం రావాలని భావించిన ప్రియుడు ఆంగ్రేజ్ సింగ్
  • ఆమె బదులు తాను పరీక్ష రాయాలని నిర్ణయం
  • బయోమెట్రిక్ లో పట్టుబడిన ఆంగ్రేజ్ సింగ్
పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో ఓ యువకుడు తన ప్రియురాలి కోసం ఆడవేషం వేసి అడ్డంగా దొరికిపోయాడు. అసలేం జరిగిందంటే... బాబా ఫరీద్ యూనివర్సిటీ జనవరి 7న ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించింది. ఆరోగ్య కార్యకర్త ఉద్యోగం కోసం పరంజీత్ కౌర్ అనే అమ్మాయి కూడా దరఖాస్తు చేసుకుంది. ఆమెకు కోట్కాపుర ప్రాంతంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. 

పరంజీత్ కౌర్ కు ఆంగ్రేజ్ సింగ్ అనే ప్రియుడు ఉన్నాడు. ఆంగ్రేజ్ సింగ్ తన ప్రియురాలి కోసం రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు ఎలాగైనా ఉద్యోగం రావాలన్న ఉద్దేశంతో, ఆమె తరఫున తాను పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రియురాలిని తలపించేలా కట్టు బొట్టుతో పరీక్షకు హాజరయ్యాడు. పొడవైన జుట్టు, నుదుటన బొట్టు, లిప్ స్టిక్, చేతికి ఎర్రగాజులు, అమ్మాయిలా దుస్తులు ధరించి పరీక్ష హాల్ కు వెళ్లాడు. 

అంతా బాగానే ఉంది కానీ, వేలిముద్రల వద్దకు వచ్చేసరికి దొరికిపోయాడు. బయోమెట్రిక్ పరికరంలో అతడి వేలిముద్రలు సరిపోలకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తానే పరంజీత్ కౌర్ అని నమ్మించేందుకు ఆమె ప్రియుడు ఆంగ్రేజ్ సింగ్ నకిలీ ఓటరు కార్డు, నకిలీ ఆధార్ కార్డును కూడా సృష్టించాడని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టే వరకు అతడి ప్లాన్ పక్కాగా సాగిపోయింది. కానీ, బయో మెట్రిక్ వద్దకు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. 

ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించిన పరంజీత్ కౌర్ కు మొదటికే మోసం వచ్చింది. ఆరోగ్య కార్యకర్త ఉద్యోగానికి ఆమె చేసుకున్న దరఖాస్తును అధికారులు రద్దు చేశారు.


More Telugu News