ఫాంహౌస్ లో బొప్పాయి సాగు.. విత్తనాల కోసం కేసీఆర్ ఫోన్.. వీడియో ఇదిగో!

  • ఒంటిమామిడిలోని ఫర్టిలైజర్ షాపు ఓనర్ కు ఫోన్ చేసిన మాజీ సీఎం
  • ఎరువులు పంపించాలని కోరినట్లు వీడియో
  • కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన షాపు యజమాని
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం (ఫాంహౌస్) లో ఈసారి బొప్పాయి, పుచ్చకాయ తదితర పంటలు పండించనున్నారట. ఈ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమానికి ఫోన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిపాలైన కేసీఆర్ కు వైద్యులు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో ఉన్న సొంతింట్లో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. మరో వారం పది రోజుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్ కు వస్తానని ఆయనే స్వయంగా ఈ ఫోన్ కాల్ లో చెప్పారు.  

సిద్ధిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలోని ఫర్టిలైజర్ షాపు యజమాని బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఫోన్ చేశారు. ఈసారి ఫాంహౌస్ లో బొప్పాయి, పుచ్చకాయ, ఇతరత్రా పంటలు సాగు చేద్దామని చెప్పారు. వ్యవసాయ పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని వివరించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను రెండు మూడు రోజుల్లో ఫాంహౌస్ కు పంపించాలని బాపురెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి బాపురెడ్డి విచారించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది సార్..’ అని అడగగా ఇప్పుడు అంతా బాగుందని, త్వరగా కోలుకున్నానని కేసీఆర్ బదులిచ్చారు.


More Telugu News