నేను జగన్ కు సహాయం చేశా... కానీ ఆయన నుంచి నేనెప్పుడూ సాయం అందుకోలేదు: రఘురామ

  • నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన రఘురామ
  • అందరి నుంచి తీసుకోవడమే కానీ జగన్ కు ఇవ్వడం తెలియదని విమర్శలు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 135 స్థానాలు వస్తాయని వెల్లడి
  • షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆ సంఖ్య పెరుగుతుందని వ్యాఖ్యలు
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. 

అందరి వద్ద నుంచి జగన్ కు తీసుకోవడమే తెలుసని, ఇవ్వడం తెలియదని విమర్శించారు. తాను జగన్ కు సహాయం చేశానని, కానీ జగన్ నుంచి తానెప్పుడూ సహాయం పొందలేదని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసినవారే నిజమైన స్నేహితులు అని, ఇవాళ సంక్రాంతి వేడుకల్లో సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తన గురించి మరోసారి ప్రస్తావించారని రఘురామ వెల్లడించారు. 

"వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ భూములు అమ్మాలని భావించారు. ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. ఆ తర్వాత ఇసుక రేట్లు పెంచాలని నిర్ణయించారు. దాన్ని కూడా నేను వ్యతిరేకించాను. దాంతో నాపై కేసులు పెట్టారు. రాజద్రోహం అంటూ అక్రమ కేసు పెట్టారు. నా నియోజవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో నేను రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యాను. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయం అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన కూటమి 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఒకవేళ షర్మిల గనుక ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే టీడీపీ-జనసేన కూటమి మరో 20 స్థానాలు అదనంగా గెలుచుకుంటుందని వివరించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తారని తెలిపారు.


More Telugu News