తాడేపల్లిలో సంక్రాంతి వేడుకలు.... హాజరైన సీఎం జగన్ దంపతులు

  • తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ
  • సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
  • ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. ఇవాళ భోగి నేపథ్యంలో, వేకువజాము నుంచే సందడి మొదలైంది. బంధుమిత్రులు, భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బిళ్లు, పిండివంటలు, గాలి పటాలు... ఇలా తెలుగు ప్రజలు సంక్రాంతిని ఘనంగా ఆస్వాదిస్తున్నారు. 

కాగా, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయం తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. 

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాలను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. సీఎం జగన్ దంపతులు గోమాతకు పూజ చేశారు. అనంతరం భోగి మంటను వెలిగించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్ధాంగి వైఎస్ భారతితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని పేర్కొంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ను వైసీపీ నేతలు, యువనేతలు కలిసి ఆశీస్సులు అందుకున్నారు. వారిలో కొందరు సీఎంకు పాదాభివందనం చేశారు. సీఎంను కలిసిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు  కూడా ఉన్నట్టు తెలుస్తోంది


More Telugu News