ఏపీకి పట్టిన పీడ వదిలే టైమొచ్చింది: పవన్ కల్యాణ్

  • మళ్లీ వైసీపీ సర్కారు వస్తే రాష్ట్రంలో అంధకారమేనని హెచ్చరిక 
  • మందడంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జనసేనాని
  • అమరావతి రైతుల త్యాగం ఊరికే పోనివ్వబోమని వెల్లడి
నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు పట్టిన పీడ తొలిగిపోయే టైమొచ్చిందని, ఆ పీడను, కీడును ఈరోజు భోగి మంటల్లో కాల్చేశామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈమేరకు తెలుగుదేశం - జనసేన ఆధ్వర్యంలో మందడంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఆయన పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కోసం, ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం భూమి ఇచ్చి త్యాగం చేసిన రైతులను మరోసారి మెచ్చుకున్నారు. వారి త్యాగం ఊరికే పోదని చెప్పారు. ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం మీరు త్యాగం చేశారో దానిని తప్పకుండా నెరవేర్చేందుకు టీడీపీ - జనసేన కృషి చేస్తాయని చెప్పారు.

అధికార పార్టీ పేరులో రైతులు ఉన్నారు తప్ప రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అందరమూ చూస్తూనే ఉన్నామని వివరించారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు తనకు తెలుసని చెప్పారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను చూసి చలించిపోయి ఈ రోజు టీడీపీ - జనసేన కలిసాయని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని, టీడీపీ - జనసేన కలవకుండా చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు.

టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే తాము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని వైసీపీ నేతలు భావించారని అన్నారు. అయితే, వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళుతుందని అన్నారు. రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి, రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించేందుకే టీడీపీతో కలిశామని వివరించారు. జగన్ సర్కారు పాలనలో రైతాంగానికే కాదు రాష్ట్రంలో ఏ వర్గానికీ మేలు కలగలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు లేవని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఉపాధి అవకాశాలు లేవని పవన్ కల్యాణ్ ఆరోపించారు.



More Telugu News