స్కూలు బెంచీలే వంటచెరుకు.. విరగ్గొట్టి మధ్యాహ్న భోజనం వండిన కుక్స్

  • బీహార్‌‌ రాజధాని పాట్నాలోని అప్‌గ్రేడెడ్ మిడిల్ స్కూల్‌లో ఘటన
  • వైరల్ అయిన వీడియోలు
  • విచారణకు ఆదేశించిన విద్యాశాఖ అధికారులు
  • ‘హ్యూమన్ ఎర్రర్’గా కొట్టిపడేసిన ప్రిన్సిపల్
బీహార్‌లోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వండేందుకు విద్యార్థులు కూర్చునే బెంచీలనే వంటచెరుకుగా ఉపయోగించుకున్నారు. బెంచీలను ముక్కలు చేసి పొయ్యిలో పెట్టి ఎంచక్కా భోజనం వండారు. రాజధాని పాట్నా జిల్లా బిహ్‌టా‌లోని అప్‌గ్రేడెడ్ మిడిల్ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.  

భోజనం వండేందుకు కలప అందుబాటులో లేకపోవడంతో టీచర్ సవితా కుమారి చెప్పడంతో బెంచీలతో వంట చేసినట్టు వంటమనుషులు చెప్పారు. అంతేకాదు, తాము వాటితో వంట చేస్తుంటే తిరిగి టీచరే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు. ఈ ఆరోపణలను సవితా కుమారి ఖండించారు. తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు కుక్స్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలను కాల్చుకోమని ప్రిన్సిపలే ఆమెకు చెప్పినట్టు సవిత ఆరోపించారు. 

ఈ ఆరోపణలను ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ రంజన్ ఖండించారు. కుక్స్‌ చదువుకోలేదని, వాతావరణం చల్లగా ఉండడంతో బెంచీలను కాల్చారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనను ‘హ్యూమన్ ఎర్రర్’గా పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని తాము గ్యాస్‌‌తోనే వండుతామని వివరించారు.


More Telugu News