మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరుతున్న మిలింద్ డియోరా

  • నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డియోరా
  • కాంగ్రెస్‌ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటన
  • కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను మొన్న ఖండించి నిన్న వీడిన నేత
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ డియోరా కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీకి నిన్న రాజీనామా చేసినట్టు ప్రకటించిన ఆయన నేడు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన పార్టీలో చేరబోతున్నారు. 

డియోరా కాంగ్రెస్‌ను వీడబోతున్నారని, శివసేనకు దగ్గరవుతున్నారని వస్తున్న వార్తలను శనివారం ఆయన ఖండించారు. వాటిలో ఏమాత్రం నిజం లేదని చెబుతూ రూమర్లుగా కొట్టిపడేశారు. ఆ తర్వాతి రోజే (ఆదివారం) కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసిన ఆయన నేడు శివసేన తీర్థం పుచ్చుకోనుండడం గమనార్హం.
 
కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు నిన్న ప్రకటించిన డియోరా.. కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టు తెలిపారు. తనకు ఇంతకాలం అండగా నిలిచిన కార్యకర్తలు, నేతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News