ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా

  • 2022లో మీడియా అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని నియామకం
  • కేబినెట్ హోదా కల్పించిన ఏపీ ప్రభుత్వం
  • వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు నేడు కొమ్మినేని ప్రకటన
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును నియమించారు. అయితే, 13 నెలలకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2022 నవంబరు 10న ఆయన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం కొమ్మినేనికి కేబినెట్ హోదా కల్పించింది.

అయితే, తాజాగా తన రాజీనామాపై కొమ్మినేని నేడు ఒక ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో మీడియా అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం పండుగ సెలవులు ఉన్నందున జనవరి 17 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని కొమ్మినేని తెలిపారు. 

జర్నలిజం పట్ల ఆసక్తి ఉన్నవారికోసం జర్నలిజం డిప్లమో కోర్సును నాగార్జున విశ్వవిద్యాలయంతో  కలిసి అందుబాటులోకి తీసుకురావడం, వర్కింగ్ జర్నలిస్టుల కోసం వివిధ అంశాలపై ఆన్ లైన్ శిక్షణ తరగతుల నిర్వహణ వంటి అంశాలు పదవీకాలంలో తనకు సంతృప్తినిచ్చాయని కొమ్మినేని వివరించారు.


More Telugu News