70 గంటల వర్క్ పై 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • ఆ విషయంలో వెనక్కి తగ్గనని స్పష్టం చేసిన మూర్తి  
  • తాను వారానికి 85 నుంచి 90 గంటలు పనిచేసేవాడినని వెల్లడి
  • ఈ వివాదంలో భర్తకు మద్దతుగా నిలిచిన సుధా మూర్తి
  • చేసే పనిపై ప్యాషన్ ఉంటే వర్క్ ను ఎంజాయ్ చేస్తారని వివరణ
ప్రతీ ఉద్యోగి వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఇటీవల దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగులు, నెటిజన్లు ఇప్పటికీ మండిపడుతున్నారు. వారానికి ఆరు పనిదినాల చొప్పున లెక్కేసినా 70 గంటలంటే సగటున రోజుకు 11.5 గంటలని, రోజులో సగ భాగం ఆఫీసు పనికే కేటాయిస్తే ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

తాజాగా ఈ విషయంపై నారాయణమూర్తి మరోమారు స్పందించారు. వారానికి 70 గంటల పని విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ వ్యాఖ్యలపై తానేమీ చింతించడం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఉద్యోగస్తులు వారానికి 70 గంటలు పనిచేయాలని, అది వారి బాధ్యతని స్పష్టం చేశారు. దేశంలో ఉంటూ ప్రభుత్వం నుంచి, ట్యాక్స్ పేయర్ల నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తి తప్పకుండా హార్డ్ వర్క్ చేయాల్సిందేనని అన్నారు. జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రతీ ఒక్కరూ కష్ట పడాలని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపనీయులు, జర్మన్లు కష్టపడి తమ తమ దేశాలను పునర్నిర్మించుకున్న విధంగా ప్రతీ భారతీయుడూ దేశం కోసం శ్రమించాల్సిందేనని నారాయణ మూర్తి వివరించారు.

చేసే పనిని ఎంజాయ్ చేస్తే అప్పుడు అదే హాలీడే: సుధామూర్తి
నారాయణ మూర్తి వ్యాఖ్యలను ఆయన భార్య, రచయిత్రి సుధా మూర్తి సమర్థించారు. చేసే పనిపై ప్యాషన్ ఉంటే, ఎంజాయ్ చేస్తూ పని చేస్తుంటే అప్పుడు పనిలోనే విశ్రాంతి దొరుకుతుందని ఆమె వివరించారు. వారానికి 70 గంటలు పనిచేయడం వల్ల వ్యక్తిగత, కుటుంబానికి కేటాయించే సమయం ఎక్కడుంటుందనే ఆరోపణలకు ఆమె బదులిచ్చారు. భార్యభర్తలు కలిసి వంటింట్లో చెరో పని చేయడం ద్వారా కలిసి గడపొచ్చని, టైమ్ ను సద్వినియోగం చేసుకోవచ్చని వివరించారు. ప్రారంభంలో తాను కూడా వారానికి 70 గంటలకు మించి పనిచేశానని సుధా మూర్తి తెలిపారు. గతంలో తాను ఓ కాలేజీలో లెక్ఛరర్ గా పనిచేశానని, ఇంట్లో బాధ్యతలు నెరవేరుస్తూనే లెక్ఛరర్ గా రాణించానని పేర్కొన్నారు.


More Telugu News