కేజ్రీవాల్ కు నాలుగోసారి సమన్లు పంపిన ఈడీ

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల 18న విచారణకు రమ్మంటూ పిలుపు
  • మూడుసార్లు సమన్లు పంపినా హాజరుకాని ఢిల్లీ సీఎం
  • తనను అరెస్టు చేయాలనే కుట్రలో భాగమే ఈ నోటీసులంటూ కేజ్రీవాల్ ఆరోపణ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగో సారి సమన్లు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ నెల 18న విచారణకు రమ్మంటూ మరోసారి పిలిచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మూడుసార్లు సమన్లు పంపినా వివిధ కారణాలు చూపుతూ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. తాజా నోటీసులతో ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన కొత్త ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని, మద్యం వ్యాపారులకు అనుకూలంగా నియమ నిబంధనలు మార్చారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో ఆప్ ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రద్దు చేసింది. అయితే, పాలసీ రూపకల్పన సందర్భంగా మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆప్ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలపై ఆరోపణలు వచ్చాయి.

దీంతో కేంద్ర దర్యాఫ్తు సంస్థలు రంగంలోకి దిగి పలువురిని విచారించాయి. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. గతేడాది మూడుసార్లు సమన్లు పంపినా ఆయన విచారణకు హాజరు కాలేదు.

ఆప్ నేతలు ఏమంటున్నారంటే..
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆప్ నేతలు చెబుతున్నారు. విచారణ మొదలుపెట్టి ఇంతకాలం గడిచినా దర్యాఫ్తు సంస్థలు ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదని గుర్తుచేస్తున్నారు. ఆప్ నేతలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలను ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడమే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశమని, అందుకే ఇలా తప్పుడు కేసుల పేరుతో సమన్లు పంపిస్తోందని మండిపడుతున్నారు. ఈడీ పంపిన సమన్లు అక్రమమని, దురుద్దేశంతో పంపిన నోటీసులకు తాను స్పందించబోనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. విచారణకు పిలిచి తనను అరెస్టు చేస్తారని ఆయన ఆరోపిస్తున్నారు.


More Telugu News