అయోధ్యలో వేడుకగా ప్రాణ ప్రతిష్ఠ.. అమెరికాలోనూ సంబరాలు

  • 10 రాష్ట్రాల్లో 40 భారీ బిల్ బోర్డులు
  • ఏర్పాటు చేసిన అమెరికాలోని వీహెచ్ పీ శాఖ
  • కార్ ర్యాలీలు, న్యూయార్క్ లో ప్రత్యక్ష ప్రసారాలు
అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర్ ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామ నామ స్మరణ చేయనుంది. అయోధ్య నగరం ఇప్పటికే ముస్తాబవగా.. విదేశాల్లోనూ వేడుకలు జరుగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందురోజు పారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద రామ రథయాత్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు అక్కడి హిందువులు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాలోని హిందువులు అక్కడి నుంచే సంబరాలు జరుపుకోనున్నారు.

రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రామ జన్మభూమిలో జరిగే ఈ వేడుకను పురస్కరించుకుని అమెరికాలోని పది రాష్ట్రాలలో భారీ బిల్ బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక హిందూ కమ్యూనిటీతో కలిసి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఈ బోర్డులను ఏర్పాటు చేసింది.

టెక్సాస్, ఇల్లినాయీ, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా సహా మొత్తం పది రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన ఈ భారీ బిల్ బోర్డులపై కొత్తగా కట్టిన రామ మందిరంతో పాటు శ్రీరాముడి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయోధ్యలో ఈ నెల 22 న ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో హిందూ అమెరికన్లు కూడా పాల్గొంటున్నారని చెప్పడమే బిల్ బోర్డుల ఏర్పాటు వెనకున్న ఉద్దేశమని హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా శాఖ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిట్టల్ చెప్పారు.

రాముడి గుడి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వీహెచ్ పీ అమెరికా చాప్టర్ ఉమ్మడి ప్రధాన కార్యదర్శి తేజ ఏ షా పేర్కొన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలలో భారీ కార్ల ర్యాలీ, ఎగ్జిబిషన్, కర్టెన్ రైజర్ కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బిల్ బోర్డుల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపట్టామని వివరించారు.


More Telugu News