గుంతలో పడిన అంబులెన్స్.. బతికిన ‘చనిపోయిన వృద్ధుడు’!

  • హర్యానాలోని కర్నాల్‌లో ఘటన
  • అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్తుండగా వృద్ధుడిలో కదలికలు
  • గుర్తించి అంబులెన్స్ డ్రైవర్‌కు చెప్పి మరో ఆసుపత్రికి తరలింపు
  • బతికే ఉన్నాడని నిర్ధారించి చికిత్స అందిస్తున్న వైద్యులు
  • తాము చనిపోయినట్టు చెప్పలేదన్న అంతకుముందు చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు
మృతి చెందిన వ్యక్తిని ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా.. అంబులెన్స్ రోడ్డుపై గొయ్యిలో పడి ఎగిరి పడింది. ఈ ఘటన తర్వాత అంబులెన్సులో తరలిస్తున్న ‘చనిపోయిన వ్యక్తి’లో కదలికలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల కోసం ఇంటి వద్ద ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు విషయం తెలిసి తమనుతాము నమ్మలేకపోయారు.  

హర్యానాలో జరిగిందీ ఘటన. చచ్చి బతికొచ్చిన ఆ వ్యక్తి పేరు దర్శన్‌సింగ్ బ్రార్. వయసు 80 సంవత్సరాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శన్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించడంతో పాటియాలా నుంచి కర్నాల్‌లోని తమ ఇంటికి అంబులెన్సులో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. 

అంబులెన్స్ గుంతలో పడడంతో కదలికలు
దర్శన్‌ను తరలిస్తున్న అంబులెన్స్ గుంతలోపడిన తర్వాత మృతదేహంలో కదలికలు కనిపించడాన్ని తోడుగా ఉన్న దర్శన్ మనవడు గుర్తించాడు. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం కూడా గమనించి వెంటనే డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో సమీపంలోని ఆసుపత్రికి అంబులెన్స్‌ను తరలించారు. అక్కడ దర్శన్‌ను పరీక్షించిన వైద్యులు అతడు బతికే ఉన్నట్టు నిర్ధారించారు. హార్ట్ పేషెంట్ అయిన దర్శన్ ప్రస్తుతం కర్నాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ వేగంగా కోలుకుంటాడని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.  

మేమలా చెప్పలేదు: వైద్యులు
దర్శన్ చనిపోయినట్టు తాము చెప్పలేదని అంతకుముందు ఆయన చికిత్స పొందిన రేవల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నేత్రపాల్ తెలిపారు. అతడిని తమ వద్దకు తీసుకొచ్చినప్పుడు శ్వాస తీసుకుంటున్నాడని, బీపీతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. మరో ఆసుపత్రిలో ఏం జరిగిందన్న విషయం తమకు తెలియదని, బహుశా టెక్నికల్ ఎర్రర్ కానీ, ఇంకేదైనా సమస్య కానీ అయి ఉంటుందని వివరించారు.


More Telugu News