గువాహటి వెళ్లాల్సిన ఇండిగో విమానం .. బంగ్లాదేశ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్

  • ముంబై నుంచి గువాహటి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ దారి మళ్లీంపు
  • గువాహటిలో తీవ్రమైన మంచు కారణంగా ఢాకాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • 9 గంటలుగా విమానంలోనే ఉన్న ప్రయాణికులు
ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ఇండిగో విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా అత్యవసరంగా ఢాకా వెళ్లి అక్కడ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. తీవ్రమైన మంచు ప్రభావంతో గువాహటి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సాధ్యపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గువాహటికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢాకాకు విమానాన్ని మళ్లించారు. 

ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో పాల్గొనేందుకు ఇంఫాల్‌కు వెళ్లేందుకు ఈ ఫ్లైట్‌లో ప్రయాణించానని, విమానాన్ని అనూహ్యంగా దారి మళ్లించాల్సి వచ్చిందని వివరించారు. ఇండిగో6ఈ ఫ్లైట్ ఎక్కామని, గువాహటికి బదులు ఢాకాలో ల్యాండ్ కావడంతో పాస్‌పోర్టులు లేకుండానే ప్రయాణికులందరూ అంతర్జాతీయ సరిహద్దును దాటారని ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. 

ప్రయాణికులు ఇంకా విమానంలోనే ఉన్నారని సూరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 9 గంటలుగా విమానంలోనే చిక్కుకుని ఉన్నామని, గువాహటి చేరుకున్నాక అక్కడి నుంచి ఇంఫాల్‌కు వెళ్తానని ఆయన మరో పోస్టులో పేర్కొన్నారు. అయితే విమానాన్ని బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించడానికి కారణాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.


More Telugu News