హౌతీలపై అరివీర భయంకరంగా విరుచుకుపడిన అమెరికా, బ్రిటన్

  • ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలను తరచూ దోచుకుంటున్న హౌతీ రెబల్స్
  • యెమన్‌లోని 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసిన అమెరికా, బ్రిటన్
  • సైనికేతర సాయం అందించిన ఆస్ట్రేలియా, కెనడా, బహ్రెయిన్, నెదర్లాండ్స్
  • మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీల హెచ్చరిక
ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కల్పిస్తున్న హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ అరివీర భయంకరంగా విరుచుకుపడ్డాయి. యెమన్‌లోని హౌతీ రెబల్స్‌‌కు సంబంధించి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించాయి. యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. యెమన్ రాజధాని సహా 16 చోట్ల 70కిపైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. వంద గైడెడ్ ఆయుధాలను ఉపయోగించి అల్ దైలామి వైమానిక స్థావరం, హొడైడా, తైజ్, హజ్జా, ధమర్, సాదా నగరాల్లోని విమానాశ్రయాలు, ఇతర శిబిరాలపై అమెరికా, బ్రిటన్ కలిసి దాడులు చేశాయి.

మూల్యం చెల్లించుకోక తప్పదు: హౌతీ హెచ్చరిక
అమెరికా, బ్రిటన్ దాడుల్లో ఐదుగురు చనిపోయారని, మరో ఆరుగురు గాయపడినట్టు హౌతీ రెబల్స్ ప్రకటించారు. ప్రతీకార దాడులు తప్పవని అమెరికా, బ్రిటన్ దేశాలను హెచ్చరించారు. ఆ రెండు దేశాలు పెద్ద తప్పు చేశాయని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదని హౌతీ నాయకుడు మహమ్మద్ అల్ బుఖైతీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడులు కొనసాగుతాయని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి తేల్చి చెప్పారు.

ఆస్ట్రేలియా సహకారం
యెమెన్‌లోని హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ జరిపిన వైమానిక దాడులకు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ కూడా సైనికేతర తోడ్పాటు అందించాయి. ఈ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛా రవాణాను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్ధమని ప్రకటించారు.


More Telugu News