ఏపీలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంచేందుకు నిరాకరణ.. ఆరోసారీ చర్చలు విఫలం

  • ప్రభుత్వంతో నాలుగు గంటలపాటు చర్చలు
  • వేతనాల పెంపు విషయంలో పట్టు వీడని అంగన్‌వాడీలు
  • జులైలోనే పెంచుతామని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ
  • ఎస్మా నోటీసు గడువు ముగియగానే తొలగిస్తామని హెచ్చరించిన ప్రభుత్వం
వేతనాలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిరా అనడంతో అంగన్‌వాడీలతో ప్రభుత్వం ఆరోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు ఎంతోకొంత పెంచాలని వేడుకున్నా మంత్రుల కమిటీ మాత్రం పెంచేది లేదని తేల్చి చెప్పింది. ఐదేళ్లకోసారి పెంచే దానికే తాము కట్టుబడి ఉన్నామని, జులైలోనే పెంచుతామని కమిటీ స్పష్టం చేసింది. సరే, అప్పుడైనా ఎంత పెంచుతారో చెప్పాలన్న అంగన్‌వాడీల ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కమిటీ నిరాకరించిందని అంగన్‌వాడీలు తెలిపారు. ఎస్మా పరిధిలో ఉన్న తమను నోటీసు గడువు ముగియగానే తొలగిస్తామని మంత్రుల కమిటీ బెదిరించిందని ఆరోపించారు. నాలుగు గంటలపాటు చర్చలు జరిగినా నిరర్థకంగానే ముగిశాయన్నారు.

వేతనపెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి కోటిమంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు తెలిపారు.


More Telugu News