ఇంగ్లండ్‌‌తో టెస్ట్ సిరీస్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. కీలక ఆటగాళ్లకు దక్కని చోటు

  • రోహిత్ శర్మ కెప్టెన్‌గా 17 మంది ఆటగాళ్లతో జట్టుని ప్రకటించిన బీసీసీఐ
  • గాయం కారణంగా షమీని, విశ్రాంతి కారణంగా ఇషాన్‌లను పక్కన పెట్టిన సెలెక్టర్లు
  • మూడవ ఛాయిస్ వికెట్ కీపర్‌గా తొలిసారిగా ధ్రువ్ జురెల్‌కు చోటు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో ఆడబోయే జట్టుని బీసీసీఐ శుక్రవారం పొద్దుపోయాక ప్రకటించింది. 17 మంది ఆటగాళ్లతో ప్రకటించిన జట్టులో చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి చోటివ్వలేదు. సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. విశ్రాంతి కోరుకోవడంతో బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కిషన్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో మూడవ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ని జట్టులోకి తీసుకున్నారు. సెలెక్టర్ల నుంచి ఈ యువ ఆటగాడికి తొలిసారి పిలుపు అందింది. గతేడాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్ ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడి 46 సగటుతో 790 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడికి 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

మరోవైపు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. అయితే దక్షిణాఫ్రికాతో ఇటీవలే జరిగిన రెండో టెస్టు ఆడిన అవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. గుజరాత్, కర్ణాటక మధ్య రంజీ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ గాయపడడంతో రాబోయే సిరీస్‌లోనూ అతడు అందుబాటులోకి రావడం అనుమానమేనని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ తర్వాత చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చేది రానిదీ అంచనా వేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

తొలి 2 మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటిచ్చింది. పేస్ విభాగానికి వస్తే అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్‌లను ఎంపిక చేసింది. ఇక ఈ జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా సిద్ధంగా ఉందని, మొదటి మ్యాచ్ జనవరి 25న హైదరాబాద్‌లో మొదలుకానుందని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది. ఫిబ్రవరి 2-6 మధ్య విశాఖపట్నం వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరగనుందని తెలిపింది. మిగతా 3 టెస్టులు రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.

తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.


More Telugu News