బీజేపీ నాకు అవసరం లేదు: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
- విభజన హామీలను బీజేపీ అమలు చేయలేదన్న తమ్మారెడ్డి భరద్వాజ
- ప్రధాన పార్టీలు ముసుగు వేసుకుని బీజేపీకి మద్దతుగా ఉన్నాయని విమర్శ
- దేశంలో మహిళలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపాటు
ఏపీలో బీజేపీని ప్రజలు రానివ్వరని... కానీ, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ముసుగు వేసుకుని బీజేపీకి మద్దతుగా ఉన్నాయని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేసిన బీజేపీ తనకు అవసరం లేదని అన్నారు. బీజేపీ హఠావో అనాల్సిన అవసరం లేదని... ప్రజలే బీజేపీని ఓడించాలని చెప్పారు. 'పద్మావతి' అనే సినిమా తమకు వ్యతిరేకంగా ఉందని ఆరోజు కొనరు అడ్డుకున్నారని... ఆరోజు ఏ పార్టీ కూడా దానిని ఖండించలేదని అన్నారు. ఆడవాళ్లను, దళితులను బీజేపీ గౌరవించదని దుయ్యబట్టారు.
దేశంలో మహిళలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. మణిపూర్ లో మారణకాండ జరిగితే... 70 రోజుల తర్వాత కానీ మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. ఆ ఘటనలను చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. ఈ ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ... చాలా మంది తమ అభిప్రాయాలను బయటకు వ్యక్తం చేయడం లేదని అన్నారు.