సెబ్ అధికారులపై నోరు పారేసుకుని... ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు... వీడియో ఇదిగో!

  • ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి 30 క్వార్టర్ బాటిళ్లు కొనుగోలు చేసిన వైనం
  • ఆ వ్యక్తిని పట్టుకుని స్టేషన్ కు తరలించిన సెబ్ అధికారులు
  • ఎస్పీ కాదు, ఎస్పీ అమ్మ మొగుడైనా సరే అంటూ ఎమ్మెల్యే రాచమల్లు వీరంగం
  • ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానంటూ నేడు ప్రకటన
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) అధికారులపై నోరు పారేసుకుని, ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. నిన్న ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి 30 క్వార్టర్ బాటిళ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళుతుండగా, సెబ్ అధికారులు పట్టుకున్నారు. అతడిని స్టేషన్ కు తరలించారు. 

అయితే, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ కు వెళ్లి సెబ్ అధికారులపై సీరియస్ అయ్యారు. "అతడ్ని ఎందుకు పట్టుకున్నారు? అతడ్ని మీరు పట్టుకున్నారు కాబట్టే నేను స్టేషన్ కు వచ్చా! ఎస్పీ కాదు... వాళ్ల అమ్మ మొగుడికి చెప్పు" అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. అయితే, ఎమ్మెల్యే రాచమల్లు అధికారుల పట్ల ఉపయోగించిన భాషపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాచమల్లు వెనక్కి తగ్గారు. సెబ్ అధికారులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించారు. 

"నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నేను ఏ పదజాలం ఉపయోగించానో దానిపట్ల క్షమాపణలు తెలుపుకుంటున్నాను. మా మీద కూడా ఒత్తిడి ఉంది సార్ అని అక్కడి ఎస్సై అన్నాడు. కేసులు పెట్టాలంటూ పైనుంచి ఏఎస్పీ గారు, ఎస్పీ గారు టార్గెట్ ఇచ్చారు అని చెప్పాడు. దాంతో నేను... ఏఎస్పీ కాదు, ఎస్పీ కాదు... ఎస్పీ గారి అమ్మ మొగుడైనా సరే పేదలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే నేను సహించను అని చెప్పాను. 

ఒక్కోసారి మనం సీరియస్ గా మాట్లాడుతూ... నువ్వు చెప్పినా వినను, మీ నాయన చెప్పినా వినను, మీ అమ్మ మొగుడు చెప్పినా వినను అంటాం. నేను కూడా ఈ క్రమంలోనే పై పదజాలం ఉపయోగించాను... మా జిల్లా వాసులకు అది బూతు పదం కాదు. 

కానీ, బాధ్యత కలిగిన ప్రజాజీవితంలో ఉన్న నేను ఆ పదం ఉపయోగించకూడదు. అందుకే నేను ఏ సెబ్ అధికారులనైతే ఎస్పీ అయినా, ఎస్పీ అమ్మ మొగుడు అయినా అని అన్నానో ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఆ మాట వలన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని కోరుతున్నా" అంటూ ఎమ్మెల్యే రాచమల్లు క్షమాపణలు చెప్పారు.


More Telugu News