కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

  • అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఏపీ హైకోర్టులో ఊరట
  • కొత్తపల్లి గీత ఎస్టీ అంటూ 2016లో అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు
  • దీనిపై అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించిన పలువురు వ్యక్తులు
  • ప్రభుత్వాలు మారినా కొనసాగుతున్న మంత్రివర్గ విచారణ
  • గీత ఎస్టీ కాదంటూ వైసీపీ సర్కారు ఉత్తర్వులు... కోర్టుకు వెళ్లిన గీత
అరకు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొత్తపల్లి గీతకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమె ఎస్టీ కాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కొత్తపల్లి గీత కులంపై ఎప్పటినుంచో వివాదం ఉంది. ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నిర్ధారిస్తూ 2016లో అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. 

అయితే, ఆ ఉత్తర్వులపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ దీనిపై మంత్రివర్గ విచారణ జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజన సంక్షేమ మంత్రి పీడిక రాజన్నదొర నేతృత్వంలో విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలో కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నవంబరు 2న ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ఆమె ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వాదనలు విన్న పిమ్మట... ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని స్పష్టం చేసింది.


More Telugu News