కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి అందరికీ అర్థమవుతోంది: కిషన్ రెడ్డి

  • ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించిందని కిషన్ రెడ్డి ఆగ్రహం
  • రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ బహిష్కరణ నిర్ణయం తీసుకుందని ఆరోపణ
  • కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అన్న కిషన్ రెడ్డి
రామమందిరం వంటి ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని... దీంతో ఆ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి అందరికీ అర్థమవుతోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని విమర్శించారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పడం రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.

కేవలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మాత్రమే కాంగ్రెస్ బహిష్కరించలేదని... ఇదివరకు జీ20, పార్లమెంట్ అఖిలపక్షం, ఎన్నికల కమిషన్ సమావేశాలను కూడా బహిష్కరించిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇలాంటి బహిష్కరణలు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అన్నారు. రామమందిర నిర్మాణ ఆహ్వానాన్ని తిరస్కరించడం దివాలాకోరు నిర్ణయమన్నారు.


More Telugu News