సంప్రదాయబద్ధంగా ‘ప్రేమ పెళ్లి’ చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు

  • ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహబంధం ద్వారా ఒక్కటైన యువతులు
  • ఆర్కెస్ట్రాలో పనిచేస్తుండగా ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ
  • వైవాహిక జీవితాన్ని గడపాలని జంట నిర్ణయం
  • చట్టబద్ధమార్గంలో అఫిడవిట్ తీసుకొని గుడిలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. వివాహ బంధం ద్వారా ఇద్దరు అమ్మాయిలు ఒక్కటయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న యువతులు ఒక ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాలకు చెందిన జయశ్రీ రాహుల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలో ఒక ఆర్కెస్ట్రా టీమ్‌లో పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ధైర్యంగా ముందడుగు వేశారు. తొలుత వివాహానికి సంబంధించిన నోటరీ అఫిడవిట్‌ను తీసుకున్నారు. అనంతరం సోమవారం డియోరియాలోని భట్‌పర్ రాణిలోని భగదా భవానీ ఆలయంలో ఏడడుగులు వేశారు.

అయితే కొన్ని రోజుల క్రితమే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీర్ఘేశ్వరనాథ్ ఆలయానికి వెళ్లగా అక్కడ అనుమతి ఇవ్వలేదు. జిల్లా అధికారుల అనుమతి లేకపోవడంతో వారిని తిప్పి పంపించారు. దీంతో ఇద్దరూ చట్టబద్ధమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో పెళ్లికి నోటరీ అఫిడవిట్‌ను పొందారు. ఆ తర్వాత మఝౌలీరాజ్‌లోని భగడ భవానీ ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకున్నారని ఆర్కెస్ట్రాకు చెందిన మున్నా పాల్ అనే వ్యక్తి తెలిపాడు. కాగా పెళ్లి తర్వాత దంపతులు తమ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, చివరికి ఎలా ఒక్కటయ్యారన్న విషయాలను అక్కడివారితో పంచుకున్నారు.


More Telugu News