నేనే సెలెక్టర్‌ని అయితే ఆ ఆటగాడిని టీ20 వరల్డ్ కప్‌కు కీపర్‌గా ఎంపిక చేస్తా: సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఫిట్‌గా ఉంటే రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా సెలెక్ట్ చేస్తానంటున్న మాజీ దిగ్గజం
  • ఫార్మాట్‌కు తగ్గట్టు ఆటను మార్చుకోగలడని వ్యాఖ్య
  • పంత్ ఫిట్‌గా లేకుంటే కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ఎంపిక చేయాలని విశ్లేషించిన గవాస్కర్
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్న టీమిండియా ఆటగాళ్లు ఎవరు? సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కుతుందా? గాయపడిన ఆటగాళ్లు కోలుకొని పునరాగమనం చేస్తారా? యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుందా?..  వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో క్రికెట్ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఇకపై జరగనున్న ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ ఎంతో కీలకం కానుందనే చర్చ జరుగుతోంది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు సంబంధించి అప్‌డేట్ లేకపోవడంతో ఆ సమయానికి ఎవరెవరు అందుబాటులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా ఉంటే రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేస్తే బావుంటుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. జట్టులోకి రిషబ్ పంత్‌కు చోటు ఇవ్వాలన్నాడు. 

‘‘నేను కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్‌గా పరిగణిస్తాను. అయితే దానికంటే ముందు రిషబ్ పంత్ పేరును సూచిస్తాను. కాలు ఫిట్‌గా ఉంటే అతడు టీమ్‌లోకి రావాలి. ఎందుకంటే రిషబ్ పంత్ ఫార్మాట్‌‌కు తగ్గట్టు ఆటను మార్చుకొని ఆడుతుంటాడు. నేనే సెలెక్టర్‌ని అయితే పంత్ పేరు ముందుగా ఎంపిక చేస్తాను. అయితే పంత్ అందుబాటులో లేకుంటే కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇస్తాను. అప్పుడు జట్టు సమతుల్యంగా కనిపిస్తుంది. అలా చేస్తే రాహుల్‌ను జట్టుకు అవసరమైన స్థానంలో బ్యాటింగ్ చేయించవచ్చు. ఓపెనర్‌గా లేదా మిడిల్ ఆర్డర్‌లో ఐదవ స్థానంలో లేదా ఆరవ స్థానంలో ఫినిషర్‌గా ఉపయోగించుకోవచ్చు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్‌ను బాగా మెరుగుపరచుకున్నాడు. ఇంతకుముందు అతడు కీపింగ్ చేసేటప్పుడు అయిష్టంగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు అసలైన వికెట్ కీపర్‌గా పరిణతి చెందాడు’’ అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు.

కాగా రిషబ్ పంత్ ఐపీఎల్ 2024తో టీ20 ఫార్మాట్ క్రికెట్‌ తిరిగి ఆడే అవకాశాలున్నాయి. అయితే కారు ప్రమాదానికి ముందు పంత్ టీ20 జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా లేడు. మరి కోలుకున్న తర్వాత ఎలా ఆడతాడనేది చూడాల్సి ఉంటుంది. ఇదిలావుండగా యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, సంజూ శాంసన్‌లను టీ20 ఫార్మాట్‌లో కీపర్లుగా టీమిండియా పరీక్షిస్తోంది. కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ కుర్రాళ్లకు అవకాశాలు అందిస్తూ పరిశీలిస్తోన్న విషయం తెలిసిందే.


More Telugu News