ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం వచ్చింది: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం
  • కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న కేటీఆర్
  • లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని దిశా నిర్దేశం  
తెలంగాణ ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిందని... మన తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ భవన్‌లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని తప్పిదాల వల్ల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయామన్నారు. ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ద్వారా మన చేతుల్లోకి తీసుకు వచ్చే సమయం వచ్చిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలను మనం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకు సాగాలని పార్టీ నాయకులకు సూచించారు.

కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గళాన్ని... బలాన్ని ఢిల్లీకి చూపించవలసి ఉందన్నారు. మన గళం వినపడాలంటే... మన బలం చూపించాలంటే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలన్నారు. తల్లడిల్లిన తెలంగాణను పదేళ్ల పాటు మనం కాపాడుకున్నామని... కానీ కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయామన్నారు.

వినయ్ భాస్కర్‌కు చురక

తెలంగాణ భవన్‌లో జరిగిన వరంగల్ పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆలస్యంగా వచ్చారు. దీంతో కేటీఆర్ ఆయనకు చురక అంటించారు. అసెంబ్లీకి ఆలస్యంగానే వస్తారు... ఇప్పుడు సమావేశాలకు కూడా ఆలస్యమేనా? అంటూ సున్నితంగా మందలించారు. 


More Telugu News