నేను అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3 వేలు ఇచ్చేవాళ్లం: చంద్రబాబు

  • విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • బొబ్బిలిలో రా కదలిరా సభ
  • జగన్ చెప్పేవన్నీ అబద్ధాలంటూ చంద్రబాబు ధ్వజం
  • తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా జగన్ పై పోరాడాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా బొబ్బిలిలో రా కదలిరా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు అని కీర్తించారు. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 

జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.3 వేలు ఇస్తానని జగన్ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత... విడతల వారీగా పెంచుతామని మాట మార్చారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే రూ.3 వేల పెన్షన్ ఇచ్చేవాళ్లమని చంద్రబాబు అన్నారు. 

ఈ ప్రభుత్వం ప్రజలను రాతియుగం వైపు నడిపిస్తోందని, కానీ తాను ప్రజలను స్వర్ణయుగం వైపు తీసుకెళ్లేందుకు నూతన సంవత్సరాది సందర్భంగా సంకల్పం తీసుకున్నానని ఉద్ఘాటించారు. ప్రజలు రాతియుగం వైపు వెళతారో, స్వర్ణయుగం వైపు వస్తారో నిర్ణయించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే భవిష్యత్తు తెలుగుజాతిదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇవాళ బొబ్బిలిలో ఇంతటి జన ప్రభంజనాన్ని ఎప్పుడూ  చూడలేదని, ఈ జనవాహినిని చూసి తాడేపల్లి తలుపులు బద్దలు కావాలని అన్నారు.


More Telugu News