కార్యకర్తల కుటుంబాలకు అండగా నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

  • 'నిజం గెలవాలి' పేరిట నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
  • ఆర్థికసాయం చెక్కులు అందిస్తున్న నారా భువనేశ్వరి
  • నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి ఆర్థికసాయం అందజేస్తున్నారు. 

ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 'నిజం గెలవాలి' పర్యటనకు విచ్చేసిన నారా భువనేశ్వరి నేడు రెండో రోజు కూడా పలువురు కార్యకర్తల కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని ముగతి గ్రామంలో కార్యకర్త మాదిగ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. నాగరాజు (50) గతేడాది సెప్టెంబరు 23న చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. 

నాగరాజు భార్య లలితాంబ, కుటుంబ సభ్యులతో మాట్లాడిన భువనేశ్వరి... వారికి ఆర్థికసాయం కింద రూ.3 లక్షల చెక్కు అందించారు. కాగా, భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి లోనైన నాగరాజు భార్య లలితాంబ కన్నీరు మున్నీరుగా విలపించారు. దాంతో, నారా భువనేశ్వరి ఆమెను ఓదార్చారు. అధైర్యపడొద్దు... మేమంతా ఉన్నాం అని ధైర్యం చెప్పారు. 

ఇవాళ నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' కార్యక్రమం కర్నూలు జిల్లా ఆదోనిలోని చేకూరి కన్వెన్షన్ వద్ద విడిది కేంద్రం నుండి ప్రారంభమైంది. నేడు ఆమె ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఐదుగురు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. 

చంద్రబాబు అర్ధాంగిని చూసేందుకు ఆదోని పట్టణ మహిళలు భారీగా తరలిరావడంతో కోలాహలం నెలకొంది. నారా భువనేశ్వరి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.


More Telugu News