విమానంలో సంభ్రమాశ్చర్యాలకు గురైన తల్లీకూతుళ్లు.. ఆనందంతో కూతురు డ్యాన్స్!

  • స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సీషెల్స్‌లో విమానమెక్కిన తల్లీకూతుళ్లు
  • విమానంలోని మొత్తం ఎకానమీ క్లాస్‌లో వీరిద్దరే ప్రయాణికులు
  • క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఆశ్చర్యంలో ముంచెత్తిన కెప్టెన్
  • ఫ్లైట్‌లో డ్యాన్సులు చేస్తూ ఆనందంలో మునిగిపోయిన తల్లీకూతుళ్లు
కొన్నిసార్లు అంతే.. అదృష్టం అలా ఏదోవైపు నుంచి ఒక్కసారిగా వచ్చి కౌగిలించేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అచ్చం అదే జరిగిందీ తళ్లీకూతుళ్లకు. వెకేషన్‌కి స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సీషెల్స్‌లో ఎమిరేట్స్‌ ఫ్లైటెక్కిన ఆ తల్లీకూతుళ్లు చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే అతిపెద్ద ఆ విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ఉన్నది వీరిద్దరే. తమకోసం ఏదో స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తున్న అనుభూతిలో మునిగిపోయారు వారిద్దరూ. 

ఆమె పేరు జో డోయెల్ (25), తల్లి కిమ్మీ చేడెల్‌ (59)తో కలిసి గత డిసెంబర్ 25న కుటుంబ సభ్యులతో క్రిస్మస్ జరుపుకొనేందుకు స్విట్జర్లాండ్ బయలుదేరారు. అయితే, ఆ విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ఈ ఇద్దరు మహిళలు తప్ప మరెవరూ లేకపోవడం వైరల్ అయిన వీడియో క్లిప్‌లో కనిపించింది. దీనిని మిలియన్ మందికిపైగా వీక్షించారు. విమానం బయలుదేరడానికి ముందు కెప్టెన్ అనౌన్స్ చేస్తూ.. ‘‘ఎమిరేట్స్ విమానంలో ఈ రోజు ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని చెప్పడంతో తల్లీకూతుళ్లు ఆశ్చర్యపోయారు. ఆనందం పట్టలేక డోయెల్ డ్యాన్స్ చేయడం కూడా ఆ వీడియోలో కనిపించింది. 

ఆ విమానంలో తామిద్దరమే ప్రయాణిస్తున్న విషయం తమకు నిజంగా ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ తర్వాత వారు చెప్పుకొచ్చారు. తమతోపాటు మరో నలుగురు ప్రయాణికులున్నప్పటికీ వారు ఫస్ట్ క్లాస్ ప్రయాణికులని, కానీ ఎకానమీ క్లాస్‌లో తామిద్దరం మాత్రమే ప్రయాణించామని చెప్పుకొచ్చారు. ప్లైట్ సిబ్బందితో ఫన్నీ వీడియోలు కూడా తీసుకున్నామని తెలిపారు. కేబిన్ క్రూ యూనిఫాంలో తన తల్లిని వీడియో కూడా తీశానని కుమార్తె పేర్కొంది. విమానంలోని ఫస్ట్‌క్లాస్ సీట్లలో చాలావరకు ఖాళీగానే ఉన్నప్పటికీ తమకు అందులో కూర్చునేందుకు అనుమతించలేదని తెలిపారు.

ఇలాంటి ఘటనే నిరుడు ఏప్రిల్‌లోనూ జరిగింది. పోర్చుగల్‌లో ఉంటున్న కుటుంబం వద్దకు బయలుదేరిన యూకే వ్యక్తి.. మొత్తం విమానంలో తానొక్కడినే ప్రయాణిస్తున్న విషయం తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆ రోజు అతడిని వీఐపీ ప్రయాణికుడిగా భావిస్తూ విమానయానసంస్థ అతడిని గమ్యానికి చేర్చింది.


More Telugu News