మహేశ్ బాబు ఎప్పుడూ ఇంత ఎమోషనల్ కాలేదు!

  • గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • తన సినిమాల గురించి మాట్లాడానికి తండ్రి లేడన్న మహేశ్ బాబు
  • ఇకపై తనకు అభిమానులే అమ్మ, నాన్న అంటూ ఎమోషనల్
  • తన సినిమాలు ఎలా ఉన్నాయో అభిమానులే చెప్పాలని వ్యాఖ్యలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ మొత్తం గుంటూరు తరలి రావడంతో కార్యక్రమం కళకళలాడింది. 

కాగా, మహేశ్ బాబు తన ప్రసంగం సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా భావోద్వేగాలతో మాట్లాడారు.

"నాకు, నాన్న గారికి సంక్రాంతి బాగా ఇష్టమైన పండుగ. ఈ పండుగ మాకెంతో కలిసొచ్చింది. సంక్రాంతి వేళ మా సినిమా రిలీజైతే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. గుంటూరు కారం చిత్రం విషయంలోనూ అదే జరుగుతుందని నమ్ముతున్నాం. కానీ ఒక్కటే బాధ... ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పేవారు, రికార్డులు, కలెక్షన్ల గురించి చెప్పేవారు. 

మా నాన్న నాకు ఎప్పుడు ఫోన్ చేసి నా సినిమా సంగతులు చెబుతారా అని ఎగ్జయిటింగ్ గా ఎదురుచూసేవాడ్ని. ఇప్పుడాయన లేరు... ఇక ఏం చెప్పాలన్నా మీరే (అభిమానులు). ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న! మీకెప్పుడూ నా హృదయంలో స్థానం ఉంటుంది" అంటూ మహేశ్ బాబు బాగా ఎమోషనల్ అయ్యారు. 

ఇక, గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ... గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎంతో సంతోషం కలిగిస్తోందని మహేశ్ బాబు అన్నారు. గుంటూరులో ఈ కార్యక్రమం జరగడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసే కారణమని వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేద్దాం అని చర్చించుకుంటుండగా, మీ ఊళ్లో చేద్దాం అని త్రివిక్రమ్ చెప్పారని, దాంతో ఆయన మాట ప్రకారం గుంటూరులో ఏర్పాటు చేశామని చెప్పారు. 

త్రివిక్రమ్ తన ఫ్యామిలీ మెంబర్ వంటి వాడని, ఆయనతో తన అనుబంధం స్నేహాన్ని మించిందని మహేశ్ బాబు వివరించారు. అతడు, ఖలేజా... ఇప్పుడు గుంటూరు కారం చిత్రంతో ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న గుంటూరు కారం చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల కథానాయిక కాగా, మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. 

ఇప్పటికే రిలీజైన గుంటూరు కారం పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా, 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే మాస్ సాంగ్ విశేషంగా అలరిస్తోంది. 

ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ మహేశ్ బాబు ఈ పాట గురించి ప్రస్తావించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనకు బ్రదర్ లాంటి వాడని, తాను, త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలతో 'కుర్చీ మడతపెట్టి' పాటను కంపోజ్ చేశాడని మహేశ్ బాబు వెల్లడించారు. గుంటూరు కారం చిత్రంలో ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అన్నారు. 

తెలుగమ్మాయి శ్రీలీలతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. ఆమె హీరోయిన్ గా రాణిస్తుండడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఓ కీలకపాత్ర కోసం మీనాక్షి చౌదరిని అడిగామని, ఆమె వెంటనే అంగీకరించిందని వివరించారు.


More Telugu News