రాతియుగం వైపు వెళతారా... నాతో స్వర్ణయుగం వైపు వస్తారా?: చంద్రబాబు

  • నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • జనసునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందని వ్యంగ్యం
  • అనర్హులను అందలం ఎక్కించి బాధలు పడుతున్నామని వెల్లడి
  • వచ్చే ఎన్నికలతో అందరి కష్టాలు తీరతాయని స్పష్టీకరణ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. సభకు పోటెత్తిన ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. ఈ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందని అన్నారు. 

వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని చంద్రబాబు విమర్శించారు. ఈ ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలతో అందరి కష్టాలు తీరతాయని స్పష్టం చేశారు. రాతియుగం వైపు వెళతారా... స్వర్ణయుగం కోసం నాతో వస్తారా? అని ప్రశ్నించారు. 

ఒక్క చాన్స్ అంటే అందరూ నమ్మి జగన్ కు ఓటేశారని, అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామని వివరించారు. జగన్ కు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులేనని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని చెప్పారు. తాము ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయం తీసుకువచ్చామని, అవుకు టన్నెల్ ను తామే పూర్తి చేశామని వెల్లడించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని వివరించారు. 

ఈ ప్రభుత్వం ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్కును అటకెక్కించిందని అన్నారు. జగన్ వచ్చాక రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. కర్నూలుకు హైకోర్టు తెస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేశారు అంటూ సీమ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువచ్చే బాధ్యత మాది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

రాయలసీమకు 350 టీఎంసీల నీరు ఇవ్వాలనేది తన లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి నీటిని బనకచర్ల రెగ్యులేటర్ కు తీసుకురావాలనేది తన ఆలోచన అని వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక కుందూ నదిపై చెక్ డ్యాములు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. మెగా డీఎస్సీ అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయని వెల్లడించారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. యువత టీడీపీ-జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

చంద్రబాబు తన ప్రసంగంలో షర్మిల అంశాన్ని కూడా ప్రస్తావించారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోందని ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసి, అనేక డ్రామాలు ఆడారని... వివేకా కుమార్తె పైనా, సీబీఐ అధికారుల పైనా కేసులు పెట్టారని వివరించారు. చెత్తపై కూడా పన్నువేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News