భారత్ వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్

  • మొట్టమొదటిసారి అధ్యక్షతతో పాటు ఆతిథ్యమివ్వనున్న ఇండియా
  • ఈ ఏడాది జులై 21 - 31 మధ్య న్యూఢిల్లీ వేదికగా జరగనున్న సెషన్
  • యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ప్రకటన
భారత్‌ వేదికగా మరో కీలకమైన అంతర్జాతీయ సమావేశం ఖరారైంది. తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌కు భారత్ ఈ ఏడాది అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది జులై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సెషన్‌ జరగనుంది. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విశాల్ శర్మ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని, 46వ సెషన్ జులై 21న మొదలై 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. 

కాగా ఈ కమిటీకి అధ్యక్షత వహించడం ద్వారా ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక, సహజ వారసత్వ ప్రదేశాల గుర్తింపు, వాటి పరిరక్షణలో భారత్ తనవంతు సహకారాన్ని అందించే అవకాశం దక్కింది. 2024లో కమిటీకి సారధిగా, అతిథిగా వ్యవహరించి చర్చలకు నాయకత్వం వహించనుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాలను రక్షించడంలో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.


More Telugu News